జిల్లా పోలీసు జాగిలం ” విక్కీ” మృతి… విచారం వ్యక్తం చేసిన జిల్లా ఎస్పీ జాగిలానికి పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది నివాళులు…పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు.
అనంతపురం జిల్లా పోలీసు భద్రతా విభాగానికి చెందిన పోలీసు జాగిలం ” విక్కీ “(14) ఆదివారం రాత్రి మృతి చెందింది. వయసు మీదపడటంతో చనిపోయింది. సుమారు ఒకటిన్నర దశాబ్దంగా జిల్లా పోలీసుశాఖకు ఎనలేని సేవలు అందించిన విక్కీ మృతి తీరనిలోటని జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS గారు పేర్కొన్నారు. విక్కీ మృతి పట్ల ఎస్పీ విచారం వ్యక్తం చేశారు.
లాబర్ జాతికి చెందిన విక్కీ 14 సంవత్సరాల కిందట అనంతపురం జిల్లా పోలీసుశాఖ భద్రతా విభాగంలో అడుగు పెట్టింది. ఏ.ఆర్ హెడ్ కానిస్టేబుల్ మోహన్ రాజ్ ఈ జాగిలానికి సంరక్షకులుగా ఉన్నారు. బాంబులు, తదితర పేలుడు పదార్థాలు గుర్తించడంలో విక్కీ సమర్థవంతంగా పని చేసింది. పలువురు వి.వి.ఐ.పి ల బందోబస్తు, అధికారిక సభలు, సమావేశాల సందర్భంగా ఈ జాగిలం విజయవంతంగా సేవలందించింది. వయసు మీద పడటంతో విక్కీ నిన్న రాత్రి మృతి చెందింది. ఈనేపథ్యంలో జిల్లా ఎస్పీ ఆదేశాలతో సోమవారం నివాళులు అర్పించి అనంతరం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఆవరణలో పోలీసు లాంఛనాలతో విక్కీ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. ఈకార్యక్రమంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్లు శ్రీశైలరెడ్డి, టైటాస్ , విక్కీ సంరక్షకులు హెడ్ కానిస్టేబుల్ మోహన్ రాజ్ , పలువురు ఆర్ ఎస్ ఐ, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.