జగన్ నాయకత్వంలో సంక్షేమ రాజ్యం. అర్హతే ప్రామాణికంగా ప్రభుత్వ పథకాలు. ఇచ్చిన హామీలను 97 శాతం నెరవేర్చాం. మూడేళ్లలో ‘అనంత అభివృద్ధి’ సాధించాం. రూ.650 కోట్లతో అభివృద్ధి పనులు. ఏడాదిలోగా పనులన్నీ పూర్తి చేస్తాం. ‘అనంత వెంకటరెడ్డి హంద్రీనీవా’ వెడల్పుతో జిల్లా సస్యశ్యామలం. వైసీపీకి, సీఎం జగన్‌కు ప్రజామద్దతు. ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి స్పష్టీకరణ. ప్రభుత్వ మూడేళ్ల పాలనపై ‘అనంత’లో సంబరాలు.
ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలన ఓ చరిత్ర అని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. వైసీపీ ప్రభుత్వ పాలనకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయం వద్ద పార్టీ నగర అధ్యక్షుడు చింతా సోమశేఖరెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేశారు.కార్యక్రమంలో ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి,ఎంపీ రంగయ్య,మేయర్ వసీం సలీమ్,డిప్యూటీ మేయర్లు వాసంతి సాహిత్య,కోగటం విజయభాస్కర్ రెడ్డి,వైకాపా అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా అనంత వెంకట రామిరెడ్డి మాట్లాడుతూ ‘‘ రాష్ట్రంలో 2019, మే 30వ తేదీన సీఎంగా జగన్మోహన్రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ రోజు మూడేళ్లు పూర్తి చేసుకుని నాలుగో ఏడాదిలోకి అడుగుపెట్టాం. జగన్ నాయకత్వంలో సాగుతున్న పరిపాలన ఓ చరిత్ర. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లయినా బడుగు, బలహీన వర్గాలు అభ్యున్నతి చెందలేదు. కానీ తొలిసారిగా సీఎం జగన్ ఆ వర్గాలకు పెద్దపీట వేశారు. ప్రజల ముంగిటకు పరిపాలన తెచ్చాం.
సచివాలయ వ్యవస్థతో 1.26 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాం. గతంలో చాలా ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మళ్లీ ఎన్నికలు వచ్చే సమయంలో నెరవేర్చే పరిస్థితులు ఉండేవి. కానీ వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజు నుంచే మేనిఫెస్టో అమలుకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే 97 శాతం హామీలు అమలు చేసిన ఘనత మా ప్రభుత్వానిది. ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో ఏ పేదవాడికి సొంతిళ్లు లేదన్న మాటే లేకుండా 31 లక్షల మందికి ఇంటి పట్టాలు పంపిణీ చేశాం. అనంతపురం నియోజకవర్గంలో 27 వేల మందికి పట్టాలు అందజేశారు.
2304 టిడ్కో ఇళ్లను అందిస్తున్నాం. ఈ మూడేళ్లలో నియోజకవర్గ రూపురేఖలు మార్చివేశాం. రూ.650 కోట్లను అభివృద్ధి పనులు చేపట్టాం. అనంతపురం నియోజకవర్గ పరిధిలోని నాలుగు పంచాయతీల్లోనే ఏకంగా రూ.22 కోట్లతో పనులు చేపట్టాం. ఏడాదిలోగా అవన్నీ పూర్తవుతాయి. అనంతపురంలోని మురికివాడల్లో రోడ్లు, డ్రెయినేజీల సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లగానే రూ.25 కోట్లు మంజూరు చేశారు. ఆ పనులు కూడా త్వరలో ప్రారంభిస్తాం. నగరంలో ప్రధాన సమస్యగా ఉన్న డంపింగ్ యార్డ్‌కు పరిష్కారం చూపించాం. ఇప్పటికే 50 శాతం బయోమైనింగ్ పనులు పూర్తయ్యాయి.
మా ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా అవినీతి రహితంగా చేపడుతున్నాం. గతంలో మా పార్టీకి ఓటు వేశారా? భవిష్యత్‌లో ఓటు వేస్తారా? అనేది ఆలోచించడం లేదు. కేవలం అర్హత ఉంటే చాలు పథకాలు అందుతున్నాయి. వైఎస్ రాజశేఖరరెడ్డి చూపిన బాటలో వైఎస్ జగన్మోహన్రెడ్డి పయనిస్తున్నారు. అనంతపురం జిల్లాను సస్యశ్యామలం చేయడం కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాం. అనంత వెంకటరెడ్డి హంద్రీనీవా సుజల స్రవంతిని వెడల్పు చేసి 3.50 లక్షల ఎకరాలకు నీరందిస్తాం.
అనంతపురంలో జరిగిన ‘సామాజిక న్యాయభేరి’ బహిరంగ సభకు విశేష ప్రజాదరణ లభించింది. బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగ స్ఫూర్తితో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెద్ద పీట వేస్తూ వారి అభ్యున్నతికి కృషి చేస్తున్నాం. మా పార్టీకి, సీఎం జగన్మోహన్రెడ్డికి ప్రజల మద్దతు ఉంది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి మేం ధైర్యంగా వెళ్తున్నామంటే అది వైఎస్ జగన్ చేపట్టిన సంక్షేమ పథకాల వల్లే. మూడేళ్ల పరిపాలనను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సీఎం జగన్మోహన్రెడ్డికి ప్రజల తరఫున అభినందనలు తెలియజేస్తున్నా’’ అని అనంత వెంకట రామిరెడ్డి తెలిపారు.