విజయనగరం….అందరి సమిష్టి కృషి ఫలితంగా మొక్కలు నాటే కార్యక్రమానికి అనూహ్య స్పందన లభిస్తోందని విజయనగరం నియోజకవర్గ శాసన సభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి పేర్కొన్నారు. శుక్రవారం 30వ డివిజన్ పరిధిలో ధర్మపురి బిసి కాలనీలో మొక్కలు నాటారు. డివిజన్ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనడంతో మొక్కలు నాటే కార్యక్రమం పండుగ వాతావరణం తలపించింది. ఆశా వర్కర్లు, సచివాలయ సిబ్బంది, రిసోర్స్ పర్సన్లు, నగరపాలక సంస్థ, అటవీశాఖ సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు ఇలా అన్ని శాఖలకు చెందిన సిబ్బంది పాల్గొనడంతో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం కల్పించినట్లు అయింది.
ఈ సందర్భంగా ప్రజలకు మొక్కలను ఉచితంగా పంపిణీ చేశారు. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి తగు చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి మీడియాతో మాట్లాడుతూ అందరి భాగస్వామ్యంతో చేపడుతున్న మొక్కలు నాటే కార్యక్రమానికి రోజురోజుకీ ఆదరణ పెరుగుతోందన్నారు. ఒక్కొక్క మొక్క కి పూర్వీకుల పేర్లు పెట్టడం తో స్థానికులు బాధ్యతను స్వీకరిస్తున్నారన్నారు. మొక్కల ఆవశ్యకత అందరికీ తెలిసే విధంగా ప్రచారం జరుగుతోందన్నారు. జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో నగరంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. అంతే కాకుండా స్థానిక సమస్యల పరిష్కారానికి పెద్ద పీట వేస్తున్నామన్నారు.ధర్మపురి కోనేరుకు ఆలనాపాలనా లేదని రోటరాక్ట్ సభ్యులు తమ దృష్టికి తేవడంతో వెంటనే అధికారులకు ఆదేశించడంతో జెసిబి తో కోనేరు పరిరక్షణ చర్యలు చేపడుతున్నారన్నారు. అంతేకాకుండా ధర్మపురి ప్రాంతంతో తనకు సన్నిహిత సంబంధం ఉందని అందుకే ఎన్నో ఏళ్లుగా సమస్యగా ఉన్న తాగునీటి కష్టాలను తీర్చేందుకు కోటి 70 లక్షల రూపాయల నిధులతో వాటర్ ట్యాంక్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసేందుకు ప్రతిపాదనలు పంపామన్నారు.
టెండర్లు ఖరారైన వెంటనే నవంబరు నెలలోపు వాటర్ ట్యాంకుకు శంకుస్థాపన చేయనున్నామని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాలన్నదే వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఆశయమని అందుకు అనుగుణంగా తాము పాలన సాగిస్తున్నామని అన్నారు. నగర మేయర్ వెంపడాపు విజయలక్ష్మి మాట్లాడుతూ మొక్కల పెంపకం అందరి బాధ్యత అని అన్నారు. నిత్యం అందుబాటులో ఉండే శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి సహాయ సహకారాలతో నగరాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. 30వ డివిజన్ కార్పొరేటర్ పతివాడ గణపతిరావు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కై మొక్కలు ఆవశ్యకత ఎంతో ఉందన్నారు. ప్రజలను భాగస్వామ్యం చేస్తూ,దిశా,దశా నిర్దేశిస్తూ తమ నాయకుడు వీరభద్రస్వామి చేస్తున్న కృషిలో తామంతా పాలుపంచుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో 31 వ డివిజన్ కార్పొరేటర్ ఎన్ని లక్ష్మణరావు, నగరపాలక సంస్థ ఈఈ డాక్టర్ కిల్లాన దిలీప్, డి ఈ అప్పారావు, డివిజన్ వైసీపీ నాయకులు పాల్గొన్నారు.