అనంతపురంలో తొలిసారిగా రెండు వైపులా కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్స. పుట్టుకతోనే రెండు చెవులూ వినిపించక, మాటలు రాక ఇబ్బంది పడుతున్న బాలుడికి అనంతపురంలోని కిమ్స్ సవీరా ఆస్పత్రి వైద్యులు రెండు వైపులా కాక్లియర్ ఇంప్లాంట్లు పెట్టి కొత్త జీవితాన్ని ప్రసాదించారు. తాడిపత్రి మండలం ఎడుగూరు గ్రామానికి చెందిన మహ్మద్ ఇర్ఫాన్ అనే బాలుడికి పుట్టుకతోనే మూగ, చెవుడు. వయసు పెరిగితే సమస్య నయమవుతుందని అతడి తల్లిదండ్రులు భావించారు. కానీ రెండున్నరేళ్ల వయసు వచ్చినా సమస్య అలాగే ఉండటంతో కిమ్స్ సవీరా ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఇక్కడ ఈఎన్టీ వైద్యనిపుణుడు డాక్టర్ రాఘవేంద్రరెడ్డిని సంప్రదించగా, ఆయన తగిన పరీక్షలు చేసి, రెండు పక్కలా కాక్లియర్ ఇంప్లాంట్లు పెట్టే శస్త్రచికిత్స చేయాలని చెప్పారు.
సాధారణ రైతు కుటుంబానికి చెందిన ఇర్ఫాన్ తండ్రి దాదాపు రూ.20 లక్షలు ఖర్చయ్యే ఆ శస్త్రచికిత్స చేయించే పరిస్థితి లేదు. అయితే, మూడేళ్లలోపు వయసున్న పిల్లలకు ఇలాంటి శస్త్రచికిత్సలను ఉచితంగా చేయించేందుకు ఆరోగ్యశ్రీ పథకంలో అవకాశం ఉంది. దీంతో మే 15వ తేదీన ఇర్ఫాన్‌కు రెండువైపులా కాక్లియర్ ఇంప్లాంట్లు అమర్చే శస్త్రచికిత్సను విజయవంతంగా చేశారు. ఇలా రెండు పక్కలా ఇంప్లాంట్లు అమర్చే శస్త్రచికిత్స చేయడం అనంతపురంలో ఇదే మొదటిసారి.
ఇంతకుముందు ఇలాంటి క్లిష్టమైన ఆపరేషన్ కేవలం హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాలలో మాత్రమే చేసేవారు. ఇప్పుడు అనంతపురంలో కిమ్స్ సవీరా ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చేయగలుగుతున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్లకు, ప్రజలకు, స్వచ్ఛంద సంస్థలకు విజ్ఞప్తి చేశారు. శస్త్రచికిత్స చేసిన బృందంలో డాక్టర్ సుబ్బారాయుడు, ఆడియాలాజిస్ట్ నాగిరెడ్డి, అనస్థీషియా నిపుణుడు డాక్టర్ సుధీర్ పాలుపంచుకున్నారు. శస్త్రచికిత్స జరిగి ఇప్పటికి రెండు వారాలు గడవడంతో బయటివైపు ఆడియో ప్రాసెసర్ పరికరాన్ని అమర్చాల్సి ఉంది. దీన్ని జిల్లా కలెక్టర్ సమక్షంలో అమర్చనున్నారు.
ఎందుకిలా.. సాధారణంగా లక్షలో ఒకరిద్దరు పిల్లలకు మాత్రమే ఇలాంటి సమస్య వస్తుందని డాక్టర్ రాఘవేంద్రరెడ్డి చెప్పారు. “కొందరిలో మేనరికం పెళ్లిళ్ల వల్ల, మరికొందరిలో జన్యు కారణాల వల్ల వస్తుంది. ఇది కాక.. స్పష్టంగా చెప్పలేని కారణాలు కూడా చాలామందిలో ఉంటాయి. త్వరగా గుర్తిస్తే, చికిత్స చేయడం ద్వారా మళ్లీ పనిచేసేలా చేస్తాం.
అందులో భాగంగా ముందుగా శస్త్రచికిత్స చేసి లోపలి భాగంలో ఒక ఇంప్లాంటు పెడతాం. బయటి భాగంలో, అంటే చెవి వెనకాల ఆడియో సిగ్నల్స్ అందుకుని లోపలకు పంపే ఆడియో ప్రాసెసర్ ఒకటి పెడతాం. తర్వాత దాదాపు రెండేళ్ల పాటు శిక్షణ కూడా ఇస్తే.. అప్పుడు మాట మామూలుగా వస్తుంది. అందులో ఏడాదికి సంబంధించిన ఖర్చులను ప్రభుత్వం భరిస్తుంది.
అన్నిరకాల శబ్దాలు పూర్తిగా వినిపిస్తేనే పిల్లలు మానసికంగా ఎదగగలరు. పిల్లలు పుట్టగానే అన్నిరకాల పరీక్షలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఓఏఈ అనే ఒక స్క్రీనింగ్ పరీక్ష చేస్తే కాక్లియా నార్మల్‌గా ఉందా లేదా అనేది తెలుస్తుంది. ఆ తర్వాత సమస్య ఉంటే మిగిలిన పరీక్షలు చేయించాలి.
వీలైనంత త్వరగా.. అంటే 6 నెలల నుంచి 1 ఏడాదిలోపు సర్జరీ చేయించాలి. అప్పుడే వినికిడి, మాట రావడం, మెదడు ఎదగడం బాగుంటుంది” అని తెలిపారు. కాగా 1000 మందిలో 10 మంది వినికిడి లోపంతో పుడుతున్నారని ఆధ్యాయనాలు వెల్లడిస్తున్నాయి. ఈ కార్యక్రమంలో కిమ్స్ సవీర ఎండి ఎస్.వి. కిషోర్ రెడ్డి, సిఇఓ పిఎస్. ప్రసాద్ తదితరులు ఉన్నారు.